భావగీతాల / లలితగీతాల పోటీలు
సాహితీ గౌతమి, రాజమండ్రి ఆధ్వర్యములో ఆదివారం 16-2-2014 న ఆదిత్య డిగ్రీ కళాశాల లో లలితగీతాలు / భావగీతాల తుది విడత పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గేయరచయిత, స్వరకర్త శ్రీ కలగా కృష్ణ మోహన్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు, ఆయన ప్రసంగిస్తూ లలిత గీతాలంటే నాదస్పర్శతో రాగరంజితాలైన భావగీతాలు, సుతారంగా చెవులకు సోకి సున్నితంగా మనసు పొరలను మీటి ఒక అందమైన భావోద్వేగానికి శ్రోతను తీసుకు వెళ్ళే రచన - స్వరరచన. లలితా గీతానికి స్వేఛ్చ ఎక్కువ. సాంప్రదాయ సంగీతం తాలూకు నియమ నిబంధన సంకెళ్ళు లేని స్వేఛ్చా విహంగం - లలితా గీతం. సంగీత వ్యాకరణాన్ని గౌరవిస్తూనే అన్ని రకాల సంగీత సాంప్రదాయాలనూ కలబోసుకొని భావ ప్రాధాన్యతతో సాగేదే లలిత గీతం . ఒక రకంగా సినిమా పాటలు కూడా లలితా గీతాలే, అయితే - సినిమా పాటల్లో భావం సన్నివేశ ప్రధానంగా ఉంటుంది. తదనుగుణంగా అనేక వాయిద్యాలను సన్నివేశం ఇనుమడించే విధంగా ఉపయోగిస్తారు. అంతే తేడా.
కొన్ని అన్నమయ్య సంకీర్తనలు రచనా పరంగా లలిత గీతాల్లా అనిపించినా ఎంతో కఠినమైన యతిప్రాసననుసరించి చేసిన రచనలనీ , త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షిత్లాల్ కీర్తనల మాదిరిగా అన్నమయ్య సంకీర్తన నోటేషన్ దొరక్కపోవటం వల్ల కొందరు గాయకులు తమకు చేతనైన విధంగా వాటిని స్వరపరచి పాడుతున్నారని. శ్రీ నేదునూరి. కృష్ణ మూర్తి గారు, అన్నమయ్య కీర్తనలను, రాగాలాపన, స్వరకల్పన, నెరవలతో కచేరీలు చేసి వాటిని వాగ్గేయకారుల కీర్తనల సరసన నిలిపే హోదానుకల్పించారు.
బాలకృష్ణ ప్రసాద్, స్వరపరచి గానం చేసిన సంకీర్తనలు లలితంగా ధ్వనించినా, స్వరపరచి పాడడంలో శాస్త్రీయతను కొల్పో లేదు . కేవలం భక్తిరస ప్రధానమైన ఈ రచనలను లలిత సంగీతంతో జోడించడం సబబు కాదనీ, కొన్ని జానపద బాణీలను అనుసరించి రచనచేసి ఉండవచ్చని అన్నారు.
శ్రీ కృష్ణ మోహన్ గారిని ఆదిత్యా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ గంగి రెడ్డి గారు శాలువా మరియు జ్ఞాపికతో సత్కరించారు. తదనంతరం విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. పోటీ జరిగిన సీనియర్ , జూనియర్ విభాగాలలో విజేతలకు ప్రధమ బహుమతిగా రెండు వేల రూపాయల నగదు,ద్వితీయ బహుమతిగా పదిహేను వందల రూపాయల నగదు, తృతీయ బహుమతిగా వెయ్యి రూపాయలు మరియు వాటితోపాటు అభినందన పత్రాలు, జ్ఞాపికలను సాహితీ గౌతమి వారు అందించి విజేతలను ప్రోత్సహించారు. అదే విధంగా పోటీలలో పాల్గొన్న మిగతా పోటీదారులకు ధ్రువపత్రాలు అందజేశారు.
విభాగాల వారీగా బహుమతులు అందుకున్నవారు ఇలా ఉన్నరు
జూనియర్స్ విభాగంలో - ప్రధమ బహుమతి కుమారి ఎన్. నవ్య ప్రవల్లిక, ద్వితీయ బహుమతి బి. పూర్ణిమ, తృతీయ బహుమతి శ్రీ పి.వి.ఎల్.ఎన్.మూర్తి గెలుపొందగా, సీహెచ్. వీర గణేష్ కన్సోలేషన్ అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వారు మరియు పలువురు గాయకులు కొన్ని భావగీతాలను ప్రేక్షకుల కొరకు పాడి వారిని రంజింపచేసారు.
ఈ తరహ పోటీలను అతి త్వరలో మరలా రాజమండ్రిలో నిర్వహిస్తామని సాహితీ గౌతమి అధ్యక్షులు శ్రీ పి. విజయ్ కుమార్ గారు అన్నారు మరియు ఉపాధ్యక్షులు చేవూరి. విజయ కుమార్ గారు వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.
సాహితీ గౌతమి ఇలాటి మరెన్నో సాహితీ కార్యక్రమాలు చెయ్యాలని హాజరైన అందరూ మనసారా అభిలషించారు.
కార్యక్రమంలో తీసిన కొన్ని చిత్రాలు మీకోసం:
0 comments:
Post a Comment