సాహితీ గౌతమి సాహిత్య, సంగీతాల పట్ల రాజమoడ్రి నగర ప్రజలలో ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యముతో ప్రారంభమయింది. వర్ధమాన కవులు, రచయితలను, వారి రచనల్నిప్రోత్సహించి, ఆవిష్కరించడం,సాహితీ ప్రసంగాలు, లలిత గీతాలు, భావ గీతాల ప్రాచుర్యం,విద్యార్ధులు,నడి వయస్కుల వారిని సాహిత్య సంగీత కార్యక్రమాలకు ఆకర్షించడం వంటివి సాహితీ గౌతమి కార్యక్రమాలు.
సాహితీ గౌతమి మొదటి కార్యక్రమం 24-8-1999 న, శ్రీ కొంపెల్ల రామకృష్ణ మూర్తి గారి కవితా సంపుటి " వెన్నెలలో వడగాల్పులు " ఆవిష్కరణ, తరువాత కొన్ని సాహితీ ప్రసంగ కార్యక్రమాలు జరిగాయి. 2003 లో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, స్థానాంతరణ పై రాజమండ్రి వదలి వెళ్ళిపోగా కార్యక్రమాలు స్తంభించిపోయాయి.
తిరిగి 2010 లో సాహితీ గౌతమి కొత్త బలాన్ని పుంజుకుంది.
భావ గీతాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యం తో, మాకు తెలిసిన కొన్ని భావ గీతాలను శ్రవణ సంపుటాలుగా వెలువరించాము. మొదటి శ్రవణ సంపుటి, " వెల్లువ ", ను లెఫ్టినెంట్ జాస్తి మూర్తి గారు 4-11-2010 న ఆవిష్కరించారు భావ గీతాల శ్రవణ సంపుటి - 'వెల్లువ' కు లభించిన విశేష స్పందన వలన కలిగిన ఉత్సాహంతో మరో రెండు భావ గీతాల శ్రవణ సంపుటాలు " హరివిల్లు, విరిజల్లు " లను 30-05-2012 న తీసుకువచ్చాం. వాటిని లోక్ సభ సభ్యులు గౌ||శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ రౌతు సూర్య ప్రకాశరావు గారు, లెఫ్టినెంట్ మూర్తి గార్లు ఆవిష్కరించారు. ఈ భావగీతాల సంపుటాల ప్రచురణకు ఓ.ఎన్.జి.సి అందజేసిన ఆర్ధిక సహాయం హర్షణీయం.ఈ భావ గీతాలను వినాలనుకునేవారు ఆయా గీతాల మీద క్లిక్ చేసి వినవచ్చు, డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.గీతాల సాహిత్యం కూడా పొందుపరచాం.పాడుకుని ఆనందించండి, మీకు తెలిసినవారందరికీ వినిపించండి.
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ మరియు నేషనల్ బుక్ ట్రస్ట్ ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాజమండ్రి పుస్తక మహోత్సవము(23-11-2012 నుండి 2-12-2012 వరకు ) లో సాహితీ గౌతమి ద్వారా అనేక కార్యక్రమములు చేశాము. ఆధునిక యుగంలోని పాశ్చాత్య సాంప్రదాయానికి మడుగులొత్తుతున్న నేటి యువతరానికి తెలుగు మాధుర్యాన్ని పరిచయం చేయడానికి సాహితీ గౌతమి కృషి చేసింది. ఇందులో భాగంగా, విద్యార్థినీ విద్యార్థులకు పొటీ కార్యక్రమాలు నిర్వహించింది.
కొత్త పుస్తకాల ఆవిష్కరణ (ఆకులో ఆకునై-2012, అమ్మ చెట్టు-2013), పుస్తక పరిచయాలు, సాహితీ ప్రసంగాలు, భావ గీతాల ప్రోత్సాహం వంటివి మేము చేసే కార్యక్రమాలు.
మున్ముందు, అందరి సహకారం తో, మరెన్నో సాహిత్య,సంగీత కార్యక్రమాలను చేయాలని మా సంకల్పం.