Wednesday, June 8, 2011

మలిగిన జ్ఞాపకాలలో (గజల్)

మలిగిన జ్ఞాపకాలలో దేని కోసం వెదుకుతావు 
ఊహల ఊపిరితో ఇలా ఎంతకాలం బ్రతుకుతావు 

నీ ముందున్నదిలే అంతులేని ఆకాశం 
ఆశల ఆసరాతో అలా ఎంతదూరం ఎగురుతావు   ||ఊహల ఊపిరితో||

మరువలేని ఆవేదనలో చివరలేని ఆలోచనలో 
తెలిసి తెలిసి ఏదో ఆశించి శూన్యమై నువ్వు మిగులుతావు || ఊహల ఊపిరితో||

దండలల్లిన మధురక్షణాలే మనసుమోసే శిలువలైతే 
చైత్రమైనా శిశిరమైనా మోడులానే గడుపుతావు  ||ఊహల ఊపిరితో||

చివికిపోయిన వలపు ఊసులు మదిని కలచే ప్రశ్నలైతే 
నవవసంతపు వేగుచుక్కవై ఎంతకాలం పొగులుతావు  ||ఊహల ఊపిరితో||| 

కళలు మాని కలతదేరిన ఎదురుచూపులు ఎవరికోసం 
పరిమళించిన గతము తలచి కంటి నీరై  కరుగుతావు  || ఊహల ఊపిరితో|| 

                                                                            రచన : శ్రీ కలగా కృష్ణమోహన్ 
                                                                            సంగీతం : శ్రీ నిర్మల్ కుమార్


ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?d3pdrhhs9tfj6b3

0 comments:

Post a Comment